Telugu Weekly Magazine

16వ లోక్ సభలో నేర చరితులు

నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫర్మ్స్‌ వారి నివేదిక ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ముందు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మంది ఎంపీల వయసు, ఆదాయం, విద్యార్హత, క్రిమినల్‌ రికార్డు వివరాలు పరిశీలించగా కింది వాస్తవాలు తెలిశాయి.

వయస్సు
బిజెపికి  చెందిన  ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎంపి 86 సంవత్సరాలు. మహిళా సభ్యులలో బిజెపికి చెందిన నజ్మాహెప్తుల్లా అందరికన్నా అధిక వయసు 74 సంవత్సరాలు కలిగి వున్నారు. మొదటిసారి ఎన్నికైనవారిలో 12 మంది 30 సంవత్సరాలలోపు, 48 మంది 31`40 సంవత్సరాలలోపు వారు.
geeturai_11
విద్యార్హతలు
లోక్‌సభకు కొత్తగా ఎన్నికైనవారిలో ఒకరు నిరక్షరాస్యులు. మెట్రిక్యులేషన్‌ అర్హత లేనివారు 13% (2009లో 3%), మెట్రిక్యు లేషన్‌ అర్హతగా  ఉన్నవారు 10% మంది (2009లో 17%),  125 మంది (23%) ఇంటర్మీడియేట్‌ (12వ తరగతి) అంతకన్నా తక్కువ విద్యార్హత కలిగివున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఎన్నికైనవారిలో 75% మంది పట్టభద్రులు  (2009లో 79%),  పీజీ చేసినవారు 28%, డాక్టరేట్‌ కలిగినవారు 6% మంది (2009లో 3%).  వ్యవసాయం వృత్తిగా ఉన్న  ఎంపీలు 27% (2009లో 27%),  సాంఘిక  సేవ వృత్తిగా ఉన్న ఎంపీలు 24% (2009లో 8%), వ్యాపారం వృత్తిగా ఉన్నవారు 20% (2009లో 15%) గా ఉన్నారు.

16వ లోక్‌సభలో  38  మంది లాయర్లు, 24 మంది డాక్టర్లు, 18 మంది కళాకారులు ఉన్నారు.

క్రిమినల్‌ కేసులు
నేషనల్‌ ఎలెక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫర్మ్స్‌ వారి నివేదిక ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్య ర్థులు  సమర్పించిన  అఫిడవిట్‌ ప్రకారం కొత్తగా  ఎన్నికైన  541 మంది ఎంపిలలో 34% ఎంపిలు  అనగా  ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్‌  కేసులు  ఎదుర్కొం టున్నారు. 2009లో 30%  అనగా  158 మంది ఎంపీలు,  2004లో 24% మంది ఎంపిలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొన్నారు.

క్రిమినల్‌   కేసులు  ఉన్న  186  మంది ఎంపిలలో  112 మంది (21%)పై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు (మర్డర్‌, హత్యాయత్నం, సామాజిక ప్రశాంతతకు అవరోధం, కిడ్నా పింగ్‌, స్త్రీలపై అత్యాచారాలు వంటి కేసులు) (2009లో 77మంది అనగా 15% ఎంపీలపై) ఉన్నాయి. 9 మంది ఎంపీలపై మర్డర్‌  కేసులు,  17 మందిపై హత్యా   యత్నం,  ఇద్దరిపై  స్త్రీలపై అత్యాచార కేసులు ఉన్నాయి. 16 మందిపై సామాజిక ప్రశాంతతకు  భంగం  కలిగించారన్న నేరారోపణలు ఉన్నాయి.  10 మందిపై రాబరీ, డెకాయిటీ, ఏడుగురిపై కిడ్నాపింగ్‌ కేసులు ఉన్నాయి.
క్రిమినల్‌  చరిత్ర  గలవారు, క్రిమినల్‌ చరిత్ర లేనివారికన్నా రెండిరతలు అధికంగా ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు గెలిచే అవకాశాలు  2014  ఎన్నికలలో 13% ఉండగా క్లీన్‌ రికార్డు  ఉన్న అభ్యర్థులు గెలిచే అవకాశాలు 5% మాత్రమే ఉన్నాయి. (ఏడి ఆర్‌, అహ్మదాబాద్‌ రిపోర్టు)

బిజెపికి చెందిన  281  మంది విజయం సాధించినవారిలో 98 మంది లేదా 35% మందిపై క్రిమినల్‌  కేసులు  ఉన్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 44  మందిలో 8గురు (18%) మంది, ఎఐఎడిఎంకెకు చెందిన 37 మందిలో ఆరుగురు (16%), శివ సేనకు చెందిన 18 మందిలో 15 మంది (83%), టీఎంసికి చెందిన 34 మందిలో ఏడుగురు (21%)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. దీనికితోడు బిజెపికి చెందిన 63 సభ్యులపై (22%), కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు (7%), ఎఐఎడీఎంకెకు చెందిన 8మంది సభ్యులపై  (44%),  శివసేనకు చెందిన 8 మంది సభ్యులపై (44%), తృణమూల్‌కు చెందిన 4 సభ్యులపై (12%) సీరియస్‌ క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ఆర్‌జెడికి  చెందిన మొత్తం నలుగురు సభ్యులపై  క్రిమినల్‌ రికార్డులు ఉన్నాయి. ఎన్‌సిపికి  చెందిన  5లో నలుగురిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. బిజెడీకి చెందిన 15% సభ్యులపై, టిడిపికి చెందిన 38% సభ్యులపై, టిఆర్‌ఎస్‌కు చెందిన 46% సభ్యులపై, సిపిఐఎంకు చెందిన 56% సభ్యులపై, వైఎస్‌ఆర్‌సీపికి చెందిన 56% మంది సభ్యులపై, ఎల్‌జెపికి 67% సభ్యులపై, పిడిపికి చెందిన 33% సభ్యు    లపై, జేడియూకు చెందిన 50% సభ్యు లపై క్రిమినల్‌ రికార్డులు ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎవరిపైనా క్రిమినల్‌ రికార్డులు లేవు. మహారాష్ట్ర, యూపి, బీహార్‌కు చెందిన అభ్యర్థులు ఎక్కువగా క్రిమినల్‌ రికార్డు కలిగివున్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి నిలబెట్టిన ప్రతి ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులలో ఒకరు క్రిమినల్‌ రికార్డు కలిగివున్నారు. సీమాంధ్ర నుండి ఎన్నికైన 82 ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు, తెలంగాణ నుంచి ఎన్ని కైన 63 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలపై క్రిమినల్‌ రికార్డు ఉంది.

ఆస్తి / ఆదాయ వివరాలు
2014  లోక్‌సభ  ఎన్నికలలో దేశంలోకల్లా అత్యధిక ధనం కలిగిన కోటీశ్వరులు 10 మంది పోటీచేయగా వీరిలో ఇరువురు మాత్రమే ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభకు ఎన్నికైన వివిధ పార్టీల ఎంపిలు సగటున 14.61 కోట్ల ఆస్తిని కలిగివున్నారు. 2009లో 54%, 2004లో 30% మంది కోటీశ్వర్లు ఉన్నారు.  దేశంలోకల్లా  అత్యంత ధనిక లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ (టీడీపీ) 683 కోట్ల ఆస్తి కలిగివున్నాడు. 442 లోక్‌సభ సభ్యులకు అనగా 82% మందికి ఒక  కోటి  అంతకన్నా  ఎక్కువ ఆస్తులు               ఉన్నాయి. (2009లో  300 మందికి అనగా 58%) బిజెపికి  చెందిన  వారిలో 237 మంది అనగా 84% కోటీశ్వరులు. బిజెపికి చెందిన ఎంపిలు  సరాసరి  11 కోట్ల ఆస్తిని కలిగి     వున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వారిలో 35 మంది కోటీశ్వరులు 16కోట్ల ఆస్తిని సగ టున కలిగివున్నారు.ఏఐఎడిఎంకె సభ్యులు 6.5 కోట్లు, బిజెడి సభ్యులు 16.5 కోట్లు, శివసేన సభ్యులు 9.2 కోట్లు, టిడిపి, టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పార్టీల అభ్యర్థుల  సగటున 60 కోట్లకుపైగా ఆస్తులు  కలిగివున్నారు.  సిపిఐఎంకు చెందిన ఎంపిలు సగటున 79లక్షల ఆస్తిని కలిగివున్నారు.  ఎల్‌జెపి సభ్యులు 2.5 కోట్లు, ఎన్‌సిపి సభ్యులు 37 కోట్లు, ఆర్‌జెడి 4 కోట్లు, పిడిపి 39 సభ్యులు 39 కోట్లు, జెడి(యూ) 1.7 కోట్ల ఆస్తులను కలిగి వున్నారు. ఆమ్‌ఆద్మీ సభ్యులు 3 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎంపి దేశంలోకెల్లా అత్యంత బీదవాడు. కేవలం 5లక్షల ఆస్తిని కలిగివున్నాడు. ఒరిస్సాలో అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం 147 మంది శాసనసభ్యులలో 52% మంది అనగా 76మంది కోటీశ్వరులు.

Leave a comment